క్రాంతి శ్రీనివాసరావు ||పునరావేశం ||
కొంచెం మాసిన గెడ్డం
తెల్లని పంచా
మోచేతులదాకా ముడిచిన చొక్కా
ఎనభై ఏళ్ళ నల్లని
వొత్తయిన జుట్టూ
పోతపోసిన ధైర్యం
నాకెంతో ఇస్టం
ఎందుకో తెలుసా?
పచ్చనిమొహం
చెదరని చిరునవ్వు
నిలువెత్తు శుభ్రం
అన్నిటినీ ఆహ్వానిస్తూనేమో
ఎప్పుడూ సన్నగా కంపించే తల
నా కెంతో ఇస్టం
ఎందుకో తెలుసా
వాళ్ళు
నా అమ్మానాన్నలు
అది నాకో ప్రేమలోకం
అందుకే నేనంటాను
నీదంటూ నీకంటూ
కొన్ని ప్రేమలోకాలుంటాయి
వెదుకు
వాళ్ళు
అసలు మనుషులే కాక పోవచ్చు
కానీ
అక్కడన్నీ ఇస్టాలే ఉంటాయి
ఆ
పేమాయస్కాంత లోకం చుట్టూ
రోజూ కాసేపు తిరుగుదాం
అప్పుడు
అక్కడ పుట్టిన కరెంటుతో
మనని మనం
రీచార్జ్ చేసుకొందాం
బలమయిన మనసుతో
మళ్ళీ
జీవిత బరిలోకి దిగుదాం
మన లోపల్లోపలా
జ్నానేంద్రియాల చుట్టూతా
గమనించాల్సింది ఎంతో ఉంది
గ్రహించి పరిగ్రహించుదాం
ఎవని కోసమో
ఎంతకాలం చప్పట్లు
రాల్చుకొందాం
మనపైనా
కొన్ని చప్పట్లు
కురిపించుకొందాం
ఆకుపచ్చ గీతంలా
మనమూ
పరవశిస్తూ
పరవశాన్ని పంచుదాం
No comments:
Post a Comment