క్రాంతి శ్రీనివాసరావు ||రెప్పల చప్పుడు ||
రెప్పలు చప్పుడు చేస్తూ
పగలంతా కాకుల్లంటి కలల్ని
తోలుతూనే ఉంటాయి
అలసి ఆగిన వెంటనే
కన్నుల్లో జొరబడి
మనసు పంట చేనును
మేసిపోతుంటాయి
ఎంతో వ్యవసాయం చేసి
పండించిన తృప్తి
తరుణానికి రాక ముందే
తరలిపోతుంటుంది
ఆశల కలుపు మొక్కలు
నిద్దుర తడి తగిలి
వద్దన్నా పెరిగిపోతుంటాయి
అన్ని మయూరాలు
అందంగానే ఆడుతాయి
గిజిగాళ్ళన్నీ
ఒకేలా గూడు కడతాయి
అన్ని కోయిలలూ
కమ్మగనే కూస్తాయు
మనిషెందుకో
సాధన చేస్తే తప్ప
ఏమీ సాధించలేడు
నెమళ్ళూ కోయలలు
గిజిగాళ్ళే కాదు
సమస్త ప్రాణుల
సర్వ లక్షణాలు
పొదిగిన జీవులు
మనుషులంతా
అందుకే మనం
మనుషులను
మనుషుల్లా కాకుండా
కుక్కలని
కోతులని
గుంటనక్కలని
జంతువులు గానే పిలుస్తుంటాం
మనిషి లో మనిషితనం
మిగలాలంటే
మనిషిని మనిషిగానే
పిలవాలంటే
సాధనా చెయ్యాల్సిందే
నిరంత శోధనా చెయ్యాల్సిందే
కను రెప్పల చప్పుడు
ఎప్పుడూ మ్రోగుతు ఉండాల్సిందే
No comments:
Post a Comment