క్రాంతి శ్రీనివాసరావు ||ఏమార్చలేనితనం ||
భయాన్ని
భయపెట్టేందుకు
నేచుట్టుకొని పట్టుకొనే
మహత్తర ఆయుధం
పాదాలను పీఠచేసి
మోకాళ్ళ దిండువేసి
ఉయ్యాలూపి
భూమితల్లి తీపిముద్దులు
తినిపించి
తప్పటడుగులకు
తోడునడచి
నాబతుకుకు
దారులు పరచేందుకు
మాకోసం తిరిగి తిరిగి
అరిగి తొలగిన
మోకాలి చిప్పలకు
చిప్పిల్లిన కళ్ళతో
వీడ్కోలు వందనాలు
నాన్నలో భాగమైన
కొత్తమోకాళ్ళకు
శతకోటి వందనాలు
మునిమనవళ్ళతో
పరుగులెట్టేందుకు
కొత్త మోకాళ్ళు
పెట్టు కొంటున్నాయి
నొప్పిని ఏమార్చలేనితనం
కడివెడు కన్నీళ్ళను పంచుకొన్నా
ఏమిలాభం?
ఇంత చేసిన నాన్నకు
ఎంతోకొంత చేసేందుకయినా
నొప్పిని బదలాయించుకొనే
మార్గం దొరికితే బాగు ............
No comments:
Post a Comment