క్రాంతి శ్రీనివాసరావు ||అగ్గితత్తడి ||
నా కన్నుల్లో నేనే నక్కొని
రెక్కలు విప్పాల్సిన దృశ్యాలను
పెడరెక్కలు కట్టాల్సిన దృశ్యాలను
లెక్కలు వేస్తున్నా
అడ్డాలో తన్ను తాను
అడ్డంగా అమ్ముకొన్నా
అర్ధాకలిని
అర్ధనగ్నత్వాన్ని
ఆనంద క్షణాలుగా ఆవిరి పట్టుకొంటూ
శబ్ధాన్ని పోగొట్టుకొన్న
ఆర్తనాదాలు
మరణశయ్యపై బతుకుతూ
మాంసాన్ని పక్కగా పరచి
ఒకేసారి
ఇద్దరూ పొందాల్సిన సౌక్యం
ఒక్కడే దొంగిలించుకు
పోతున్నప్పుడు
అర్ధాన్ని విరగ్గొట్టుకొన్న
జీవపదార్ధాలు
అమ్మై భార్యై
ప్రేమను నిర్వచిస్తుంటే
అత్తై ఆడపడుచై
కత్తులు పట్టుకొని
మగస్వామ్యం చేతిలో
పనిముట్టయిన
చిత్ర విచిత్ర సంవేదనలు
పట్టాలు పొట్టలు నింపకుంటే
తల పోటీల వలలో
తల్ల డిల్లుతున్న
తరుణ వయస్కుల
మడి కట్టుకొన్న
తడి కన్నులు
అగ్గితత్తడి అవుతున్న
ఆగ్రహ క్షణాలు
నేటిని పారేసుకోని
రేపు వెతుక్కొందామనుకొనే
వాసన రాని శవాల
వార్ధ్యక్యపు జాడలు
జాలువారు శబ్ధాలు
తమకు తామే
బానిసత్వానికి దత్తతపోయి
సంకెలలు
అలంకార మనుకొనే
చాదస్తపు ఇంతుల
చెదపట్టిన మెదళ్ళు
దృతరాస్ట్ర కబందుని
కౌగిలింతల్లా
ఒక్కసారే
ప్రభుత్వ ప్రైవేటు అప్పుల
పరిస్వంగం లో
రాచపుండు మొలచిన
రాజకీయ క్షేత్రంలో
రైతులు
ఛిద్రమవుతున్న
సంధర్భాలు
బతుకు గురించి ఊసేలేని
బస్తాలకొద్ది పుస్తకాల మధ్య
బడి బంట్రోతులై
ర్యాంకులు మోస్తూ
అనర్ధ అలక్ష్య
దారుల వెంట
బాల్యపు నడుములు
అరిగించుకొంటున్న
భావి పౌరులను
పేలని బాణాసంచాలు చేస్తున్న
తెల్ల చీకటి తెంపరితనం
కళ్ళముందరి రంగుల తెర
హృదయపు రంగులు
మింగేస్తూ
మనసు నిండా
బ్లాక్ అండ్ వైట్
రీళ్ళు తిప్పుతుంటే
మనిషికీ మృగానికీ మధ్య
సరిహద్దు రేఖలు
చెరిగిపోయి
నేరం
కొత్త నాట్య భంగిమలు
నేర్చుకొంటున్న వైనాలు
ఎన్నో ఎన్నో ఎన్నో ఇంకెన్నో
ఇంకిన కళ్ళ్ నడగండి
ఎక్కడయినా కనిపిస్తే ఇంకెన్నో చెబుతాయి
No comments:
Post a Comment