Wednesday, 10 April 2013

|మొదటి ఒకటో తారీఖు ||


 క్రాంతి శ్రీనివాసరావు ||మొదటి ఒకటో తారీఖు ||


        బ్రహ్మ సృష్టి మొదలెట్టిన రోజంటూ
        కొత్తదనం లేకుండా
        ఇంకా వరహమిహిరుడి
        పంచాంగమే పఠిస్తున్నాం

        కొత్త సంవత్సరాన్ని
        అర్ధరాత్రి ఆహ్వానించడం నేర్పి
        ఉషోదయాన ఉగాదిని పిలవమంటే ఎలా
        సాంస్కృతిక పునాదులు
        కదులుతున్న చప్పుళ్ళ మధ్య
        సంవత్సరాది అంటూనే
        ఉగాది వచ్చే రోజు కోసం
        తేదీలను వెతుక్కొనే
        చాదస్తపు చిత్తసుద్దిలో ఉన్నాం

        కాలం చెట్టు
        మారాకు వేసేవేళ
        చిగుళ్ళను తెంపుకు తింటూ
        పక్షం రోజులకు రాలిపోయే
        టేస్ట్ బడ్ లకు
        మొదట అనుభవమైన రుచిని
        సంవత్సర జీవితానికి ఆపాదించుకొంటున్నాం

        వేప చిగురులు తినిపించి
        వేదన భరించడం నేర్పాలిప్పుడు
        కవి పెన్నులలో ఆగిపోయిన ఉగాదిని
        జాతి జనుల కన్నులలో పోయాలిప్పుడు

        వసంతాన్ని సొంతంచేసుకోవడం
        నేర్పాలిప్పుడు
        ఉగాదిని
        పునఃసృష్టి చెయ్యాలిప్పుడు
        ఏది మొదటి ఒకటో తారీఖో
        తేల్చాలిప్పుడు
         

No comments:

Post a Comment