క్రాంతి శ్రీనివాసరావు ||కొత్త కళ్ళజోడు ||
ఒంటరిగా
అద్దం ముందు
మూడొందలరవై డిగ్రీలలో
నిన్ను నీవు చూసుకొనేందుకు
ఎన్ని వంకరలు పోతావోకదా!
ఎందుకయ్యా
ఎదుటివాళ్ళనందరినీ
ఒక్క మాట పట్టుకొనో
ఒక్క చూపుతోనో
నిర్ధయగా నిర్ధారిస్తుంటావు
నిద్దురలో వచ్చిన
కలలో తప్ప
నీవు కన్నకలల లో
ఎన్నడూ
నీవూ నీవాడు తప్ప
ఒక్కసారన్నా
వేరేఎవరయినా హీరోగా వున్నాడా?
ఎందుకయ్యా
అందరూ స్వార్ధపరులని
శాపనార్ధాలు పెడుతుంటావు
నీకున్నది ఏదయినా
కనీసం
నీ అవసరానికి
రెండింతలు
మించిన దాన్నయినా పంచావా?
ఎందుకయ్యా
అందరూ వంచనపరులేనని
వూరికే వచిస్తుంటావు
ఎంతకాలం
నీపై నీవే
పంచదార పలుకుల
పలుకులు
చిలకరించుకొంటావ్
ఓ మనిషీ
ఏనాడయినా
నిన్ను నీవు
విన్నావా
నీఎద నిండా
ఎండుటాకుల చప్పుడు
భూమ్మీద నిలబడ్డ మనిషి
చందమామ వెనుక వైపు
చూడలేనట్లు
ఇంకెంతకాలం
మనిషి లోని మనిషిని
చూడకుండా ఉంటావ్
ఇదిగో
కవిత్వపు కళ్ళజోడు
లోపలి మనుషుల
జాడలు చూడు
నీ లోపలి నీడలనూ చూడు
నీలోని వాళ్ళను
వాళ్ళలోని నిన్నూ
పోగేసి పెద్ద జట్టు కట్టు
మనిషి పాటకు
సరికొత్త మానవత్వ
బాణీలను కట్టు
గ్లోబల్ దుస్టత్వం పై
దాడికి
తిరుగులేని
ఆయుధం పట్టు
No comments:
Post a Comment