క్రాంతి శ్రీనివాసరావు || నీలోకి ||
ఆలోచన పట్టుకోవాలని
పైకో కిందికో పక్కకో
చూపులు నిలబెడుతుంటాం
ఇంకా సాధ్యం కాలేదనుకొంటే
రెప్పలు కప్పేస్తుంటాం
కాసేపు
నీ ఊపిరి పక్కకు జరిపి
వేరే ఊపిరి లోనికి తీసుకో
శరీరమంతా మనసేఅయు
భూమ్యాకర్షణ దిక్కరిస్తూ
దూది పింజలా మారిపోతుంది
కొత్త ఊపిరి కొత్త ఇల్లులో
గది గదిని పలక రించి
పరిమళించడం నేర్పుతుంది
నీలో నీవేఉన్నప్పుడు
నీకు తెలియని కోణాలను
బాణాల్లా సంధించి
బాధపెడుతుంటావు
నీలోపల నీకే
గుచ్చుకొన్నప్పుడల్లా
బాధపడుతుంటావు
వీలు చేసుకొని
ఆకాశానివైపో
ఆకాశం దాటి అనంతానివైపో
కాలాన్ని శ్వాసిస్తున్న ప్రకృతివైపో
హృదయాన్ని
చిగురిస్తున్న ఆకుల తాజాదనంలో
నీవు చేరగలిగిన
హద్దులెరుగని ఆకాశపు సరిహద్దుల్లో
నిన్ను నీవే ఉతుక్కో
తిరిగి నీలోకి నీవు తరలిపో
కరగిపో కాలిపో
నీవే కార్చిచ్చు వైపో
వడకట్టుకొని
వెలుగులు కప్పుకొని
తిరిగి నీలోకి నీవు తరలిపో
నీవే తనయి
నీలోని తనూ నీవు జతయిపోతే
పరిమలిస్తున్న నులివెచ్చని మంటలు
బాధల శీతల తలాలలై చల్లిపోతాయి
శరీరమంతా మనసయునప్పుడు
వయసయుపోవడమనేది లేనేలేదు
నీ స్టేషనులో నీవు దిగిపోవడం తప్ప
No comments:
Post a Comment