Wednesday, 23 January 2013

పగిలిపోయిన మొహం


 క్రాంతి శ్రీనివాసరావు ||పగిలిపోయిన మొహం ||


      పగిలి పోయిన మొహాలుకదా మనవి
      స్టారు హోటల్లోనో
      బారులోనో  వున్నప్పుడు
      బిల్లులో పదో పాతికో రావాల్సివస్తే
      వదిలేసి
      యాబై రూపాయుల ఖరీదుచేసే
      కృతఙ్నతకోసం
      బేరర్ మొహం లో వెదుకులాడుతుంటాం
   
      బయటపడ్డాక
      బతుకీడ్చలేక
      చివరి మెట్టుకు జారి
      చెయ్యుసాచిన
      దీనత్వానికి
      చిల్లర లేదని చెప్పి
      కడుపాకలి ఖరీదు
      పావలాగానో అర్ధగానో
      నిర్ధారిస్తుంటాం
      పగిలి పోయిన మొహాలుకదా మనవి

      సినిమాహాల్లోనో
      టీవీ ముందో కూర్చున్నప్పుడు
      కళ్ళను కర్చిఫ్ పరామర్సిస్తూనే వుంటుంది
   
      జీవిత తెరపై
      కటిక నిజాలు ఎదురయినప్పుడు మాత్రం
      వొడుపుగా తప్పుకొనేందుకు
      దారులు వెతుకుతుంటాయి
      అవే కళ్ళు
      పగిలి పోయిన మొహాలుకదా మనవి
 
      ప్రతీ సంబంధం లోనూ
      కట్టిపడేసిన
      దారాల ఖరీదు లెక్కలు వేస్తుంటాం
      ప్రయోజనమే పరమార్ధం గా
      ప్రయాణం కొనసాగిస్తుంటాం
      పగిలి పోయిన మొహాలుకదా మనవి

      విజయం వెనకాల
      పరుగెత్తటం మానుకోలేం
      విజయం పై స్వారీ చేయడానికి
      సాహసమూ చేయలేం
      పగిలి పోయిన మొహాలుకదా మనవి

Tuesday, 22 January 2013

పిల్లిమొగ్గ



 క్రాంతి శ్రీనివాసరావు ||పిల్లిమొగ్గ ||


     తీరిగ్గా
     ఆలోచనల చిక్కు
     తీసుకుంటున్న వేళ
     ఎవడో తలపులు తడతాడు
     లోపలికి పిలిచేంతలోపే
     తరలి పోతుంటాడు
     ఎండిపోయిన శబ్ధాలు మళ్ళీ
     మౌనాన్ని పెనవేసుకుంటాయి
     మనసు తీరం నిండా
     లేత నీడలు ప్రహారాకాస్తుంటాయి
   
     మనసు సంద్రం లోని
     పదార్ధ భావన
     మనసే నిర్ధారించలేక
     బాహ్యస్మృతులను
     బయటకు  బదలాయిస్తుంటుంది
     అప్పుడప్పుడు
     నిశ్శబ్ధం నోరుచేసుకుంటే
     వెలుతురుకు కళ్ళు మొలచి
     శాంతికి దారులు దర్శన మిస్తుంటాయి
     
     అనుభవాలు అదేపనిగా
     మనసు గుమ్మం ముందు
     ముగ్గులు వేస్తుంటాయి
     కొత్త కోరికలు మాత్రం
     పిల్లి మొగ్గలు వేస్తుంటాయి
     

తాజాదనం

క్రాంతి శ్రీనివాసరావు ||తాజాదనం ||

కిటికీ రెక్కలు కట్టుకొని 
హృదయం ఉదయం వైపుకు 
పరుగులు తీసింది

శూర్యూడు పొద్దున్నే
ప్రకృతి కాంతకు తొడిగిన
పసిడి నగలు చూసేందుకు

అది మురిసి
నవ్వినప్పుడు
జారిపడ్డ మంచు ముత్యాలలో
స్నానం చేస్తున్న
గా్లి సౌందర్యం చూసి
తాకి తన్మ్యయత్నం చెందేందుకు

కిటికీ రెక్కలు కట్టుకొని
హృదయం ఉదయం వైపుకు
పరుగులు తీసింది

ఏటవాలు కిరణాలు
ఏటివాలు పై
ఎదురీదుతుంటే

దీర్ఘాలు తీసిన నీడలు
వెనక్కి వెనక్కి నడుస్తుంటే

గెలుపోటములు అందాన్ని
గమనించేందుకు

కిటికీ రెక్కలు కట్టుకొని
హృదయం ఉదయం వైపుకు
పరుగులు తీసింది

పూర్వ స్మృతులు మరచి
పుట్టుక తాజాదనం
అంటించుకొనేందుకు

పలక చెరిపి
బలపాన్ని
మళ్ళీ బతుకు పాట
మొదలెట్టమని
కోరేందుకు

కిటికీ రెక్కలు కట్టుకొని
హృదయం ఉదయం వైపుకు
పరుగులు తీసింది