Tuesday, 22 January 2013

పిల్లిమొగ్గ



 క్రాంతి శ్రీనివాసరావు ||పిల్లిమొగ్గ ||


     తీరిగ్గా
     ఆలోచనల చిక్కు
     తీసుకుంటున్న వేళ
     ఎవడో తలపులు తడతాడు
     లోపలికి పిలిచేంతలోపే
     తరలి పోతుంటాడు
     ఎండిపోయిన శబ్ధాలు మళ్ళీ
     మౌనాన్ని పెనవేసుకుంటాయి
     మనసు తీరం నిండా
     లేత నీడలు ప్రహారాకాస్తుంటాయి
   
     మనసు సంద్రం లోని
     పదార్ధ భావన
     మనసే నిర్ధారించలేక
     బాహ్యస్మృతులను
     బయటకు  బదలాయిస్తుంటుంది
     అప్పుడప్పుడు
     నిశ్శబ్ధం నోరుచేసుకుంటే
     వెలుతురుకు కళ్ళు మొలచి
     శాంతికి దారులు దర్శన మిస్తుంటాయి
     
     అనుభవాలు అదేపనిగా
     మనసు గుమ్మం ముందు
     ముగ్గులు వేస్తుంటాయి
     కొత్త కోరికలు మాత్రం
     పిల్లి మొగ్గలు వేస్తుంటాయి
     

No comments:

Post a Comment