Wednesday, 23 January 2013

పగిలిపోయిన మొహం


 క్రాంతి శ్రీనివాసరావు ||పగిలిపోయిన మొహం ||


      పగిలి పోయిన మొహాలుకదా మనవి
      స్టారు హోటల్లోనో
      బారులోనో  వున్నప్పుడు
      బిల్లులో పదో పాతికో రావాల్సివస్తే
      వదిలేసి
      యాబై రూపాయుల ఖరీదుచేసే
      కృతఙ్నతకోసం
      బేరర్ మొహం లో వెదుకులాడుతుంటాం
   
      బయటపడ్డాక
      బతుకీడ్చలేక
      చివరి మెట్టుకు జారి
      చెయ్యుసాచిన
      దీనత్వానికి
      చిల్లర లేదని చెప్పి
      కడుపాకలి ఖరీదు
      పావలాగానో అర్ధగానో
      నిర్ధారిస్తుంటాం
      పగిలి పోయిన మొహాలుకదా మనవి

      సినిమాహాల్లోనో
      టీవీ ముందో కూర్చున్నప్పుడు
      కళ్ళను కర్చిఫ్ పరామర్సిస్తూనే వుంటుంది
   
      జీవిత తెరపై
      కటిక నిజాలు ఎదురయినప్పుడు మాత్రం
      వొడుపుగా తప్పుకొనేందుకు
      దారులు వెతుకుతుంటాయి
      అవే కళ్ళు
      పగిలి పోయిన మొహాలుకదా మనవి
 
      ప్రతీ సంబంధం లోనూ
      కట్టిపడేసిన
      దారాల ఖరీదు లెక్కలు వేస్తుంటాం
      ప్రయోజనమే పరమార్ధం గా
      ప్రయాణం కొనసాగిస్తుంటాం
      పగిలి పోయిన మొహాలుకదా మనవి

      విజయం వెనకాల
      పరుగెత్తటం మానుకోలేం
      విజయం పై స్వారీ చేయడానికి
      సాహసమూ చేయలేం
      పగిలి పోయిన మొహాలుకదా మనవి

No comments:

Post a Comment