Tuesday, 12 March 2013
||ఒకానొక ప్రాతఃసమయం ||
క్రాంతి శ్రీనివాసరావు ||ఒకానొక ప్రాతఃసమయం ||
ఒకానొక ప్రాతఃసమయాన
చీకటి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు
ప్రాణం పై పేపరు వైట్ లా
అప్పటి దాకా అదిమి పెట్టిన
దేహపు ద్రవ్యరాశి మూలకణాలు
పక్కకు దొర్లిపోగానే
పడుకొన్న మంచమే
వంచన చేసి
వరండాలోకి విసిరికొడుతుంది
ఆపై
కన్నీళ్ళెన్నో కురుస్తుంటాయక్కడ
కానీ
ఏవోకొన్ని
దుఃఖప్రవాహాలకు మాత్రమే
హృదయాన్ని కోతవేసే
ఊరవడి వుంటుంది
ఎందరి బుగ్గలపైనో
చారికలు మొలుస్తాయి
కొందరి హృదయాలపైనే
చారికలు వెలుస్తాయి
ఆకాసేపు
శతృవు సైతం
మనిషి మంచోడే
మాటే కఠిన మని కితాబులిస్తుంటాడు
జీవం కాలుశ్యమేమో
విడిచిన వెంటనే
దేహం పవిత్ర పదార్ధమవుతుంది
వయసుతో నిమిత్తం లేకుండా
వందనాలర్పిస్తుంటారందరు
జీవుడు దేవుడు
ఒకటే అంటాం కానీ
జీవుడు తొలగిన
దేహ దేవాలయానికే
కొబ్బరులు హారతులూ
సమర్పిస్తుంటామెందుకో
చిక్కుబడి తెగి పోగులు పడ్డ
మనిషితనం
మళ్ళీ తీగలుగా మొలకెత్తి
అల్లుకొనే రోజు కోసం
మనిషిని
దేహం చిరునామాగా వున్నప్పుడే
గుర్తించే రోజు కోసం
అందరం ఆశపడుతూనే వుంటాం కాని
మన లోపలికి తొంగిచూసేందుకు మాత్రం
బద్దకిస్తూనే వుంటాం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment