క్రాంతి శ్రీనివాసరావు ||ఎందరిలానో నేనూ ||
ఒక్కోసారి
సూర్యుడు మేఘాలను
తగలెడుతున్నాడనిపిస్తుంది
మరొసారి
కాలం తూకం బల్లెక్కీ
సూర్యుడూ చంద్రుడు
పైకీ కిందికీ
ఊగుతున్నారని పిస్తుంది
ఇంకొసారి
చీకటికి ఆకలేసి ఆబగా
సూర్యుణ్ణి ఆరగిస్తుందనిపిస్తుంది
వేరొకసారి
సముద్రంలో స్నానం చేసేందుకు
చాటుకు వెళుతున్నాడనిపిస్తుంది
అప్పుడప్పుడూ
రాత్రితో సంగమించి
పొద్దున్నే మరో సూర్యుణ్ణి
మనకోసం సృష్టించేందుకు
వెళుతున్నాడనిపిస్తుంది
ఇప్పుడేమో
ఎప్పుడూ అదే జరుగుతున్నా
మనసు మబ్బులు
కళ్ళకు అడ్డం పడి
నేనే
తికమక పడుతున్నాననిపిస్తుంది
జీవిత తిరునాళ్ళలో
ఎందరిలానో
నేనూ
చిందర వందర పడుతూనేవుంటానేమో
ఉచ్వాస నిశ్వాసల
యిగళ గీతం ఆగిపోయేదాకా.....
No comments:
Post a Comment