క్రాంతి శ్రీనివాసరావు ||అందం చూడవయా ||
వెలుతురు సంద్రంలొ
కన్నుల తేరులెక్కి
జీవితం రుచిపెరిగేందుకు
అప్పుడప్పుడు తరలిపో
ఆనందపు అలలుమధ్య
తడిసిపో
ఊరుదాటేటప్పుడు
కొండమీది బండలను
ఒక్కసారి లోపలికి తీసుకో
గతకాలాన్ని ఫోటోలుగాతీసి
భద్రంగా దాచుకో
కరిగిపోయిన కాలం
నీపై కురిసిపోయేలా
చేసుకో
ప్రకృతి వొడిలో
కాస్తంత పసితనాన్ని
బుగ్గలపై
పౌడరులా అద్దుకో
జ్నానం
హృదయానికి చేసిన
గాయాలను
మానేలా చేసుకో
అన్నీ విడిచి
అన్నీ మరచి
అందరిలో అన్నిటిలో
కలసిపో కరగిపో
బైరాగిలా మారిపో
నీ బతుకు చిత్రాన్ని
బయటికొచ్చి
ఒక్కసారి చూసుకో
అందమయిన
దృశ్యాలను అందినన్నీ
కోసుకో
మరింతగా పండేందుకు
మనసు బుట్టలో
మాగేసుకో
భూమి పుస్తకం
చదివేందుకు
అప్పుడప్పుడు
అలాఅలా
గిరాగిరా తిరిగిరా
No comments:
Post a Comment