క్రాంతి శ్రీనివాసరావు || స్నేహనము ||
మిత్రమా
నేను మాత్రమే
అనువదించుకోగల
గూఢ లిపిని మోసుకొచ్చే
నాకోసం విడుదలయిన
విశ్వకిరణానివి నీవు
నిరీక్షణ లేని
క్షణక్షణ సమీక్షణానికి
ఎప్పుడూ సిద్దంగావుండే
నిలువుటద్దానివి నీవు
మిత్రమా
నీ పలుచని మౌనం వెనుకున్న
ధర్మాగ్రహ ధగద్ధగల సెగ
నా కనురెప్పల పైన కాపలాదారు
ఎన్నడూ
విసుగు ముసుగెయ్యని
నీ సముఖము
నాకోసం
నవ్వుల చేతులు సాచి
వెన్నునిమిరే
ధైర్యపు జాడ
వెన్నెల వెండి తీగల వెంట
జారే వెలుగు బిందువుల తడితో
నా తల వాకిలి అలికే
అమ్మ అరచేతివి నీవు
చూపుడు వేలు ముడిచి
నీ చిటికెన వేలు అందించు నేస్తం
No comments:
Post a Comment