Tuesday, 30 April 2013
||శాస్త్ర కల (కళ )||
క్రాంతి శ్రీనివాసరావు ||శాస్త్ర కల (కళ )||
నిన్ననీకు
సూక్ష్మాతి సూక్ష్మం
నేడు
అనంతం
ఇప్పటి
నీఅనంతం
రేపటికి
సూక్ష్మాతి సూక్ష్మం
దూరాన్నిప్పటికే
కాలంతో
కాంతి వేగంతో
కొలుచుకొనేంత దూరం వెళ్ళాం
కాంతి వేగాన్ని
నియంత్రించే రోజు
కాలాన్ని
వెనక్కీ
ముందుకీ
మళ్ళేసే రోజు
మరెంతో
దూరంలో లేదు
అంతటినీ
అలలమయం చేసి
తిండి నిద్రా
మైధునాలు
విడివిడిగా లేకుండా
వేరే ఏదో
మహత్తర
దివ్యఅనుభవం
నిత్యం పొందుతూ
స్థల కాల పదార్ధాల మధ్య
సరదాగా విహరిస్తూ
కొత్తవింత
అంతులేని తనంవైపు
ప్రసరిస్తూ
ప్రభవిస్తూ
చలిస్తున్న
జ్వలిస్తున్న
అనంత చైతన్యమై
ప్రాణాలన్నీ ఒకటిగా
పేరుకుపోయే రోజు
ఎంతో దూరంలో లేదు
విజ్జ్నానం వేగంగా పరుగెడుతోంది
కొత్త వేదాంతం ఏమంటుందో వినాలనుంది
బతికుంటే నాకూ కొత్త మార్పులు కనాలనివుంది
Sunday, 28 April 2013
|| పండగ ||
క్రాంతి శ్రీనివాసరావు || పండగ ||
ఏడాదికి ఓక్కసారి
బంగీ జంపు చేస్తూ
క్షణాలు మురుస్తుంటాయి
మళ్ళీ పుట్టి మెరుస్తుంటాయి
ఏడాదిగా సాగి
రోజుగా మిగిలి
క్షణాలుగా కుదించబడి
హఠాత్తుగా మేలుకొంటాయు
నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళో
నీతో పని వున్నవాళ్ళో
రోజు మొదలయ్యే క్షణాల్లో
ఊపిరిపోసి విడుదల చేస్తుంటారు
ఎందరికో
పట్టాలపై పెట్టీన
సత్తురూపాయి బిళ్ళలా
జీవిత రైలు బండి
తొక్కుకొంటూ పోతే
పుట్టిన క్షణం
సాగిపోయి
పక్కకు దొర్లిపోతుంది
ఏకొందరికో
కాలం మొక్కకు పూసిన పువ్వై
పరిమళించి
పరవశింప చేస్తుంటుంది
పుట్టిన నుండి
పోయేవరకూ
లక్షల క్షణాలు
రాలిపోతుంటాయి
ఒక్క క్షణాన్నయినా
వొడిసి పట్టుకొని
పండించుకొంన్నవారికి
పుట్టిన పోయిన
రెండు క్షణాలు
ముందుతరాలకు
పండగలవుతాయు
అందుకే
కాలాన్ని చంపకుండా
క్షణాలకు జీవ లక్షణాలు
అంటించే పనిలో పడదాం
Saturday, 27 April 2013
|చైతన్యపు గురుతులు |
క్రాంతి శ్రీనివాసరావు ||చైతన్యపు గురుతులు ||
నెత్తురు చినుకుల
తడిసిన కత్తులు
నిన్నటి వైపుకు
నెట్టే వ్యక్తులు
చరిత్రకోసం
దాచిన గురుతులు
కూలే కుడ్యం
విరిగిన శిల్పం
చిరిగిన చిత్రం
చరిత్రకోసం
దాచిన గురుతులు
బిక్షం వేసిన
ఔదార్యాలు
కక్షల కోసం
బలిదానాలు
చరిత్రకోసం
దాచిన గురుతులు
ఎక్కడి వాడిని
అక్కడే ఉంచి
ఎగబడ కుండా
తెగబడ కుండా
కలబడ కుండా
శిక్షాస్మృతులను
లిఖించి పెట్టిన
శిలా శాసనాల్
చరిత్రకోసం
దాచిన గురుతులు
దుఃఖం బాపి
కష్టం దోచే
వ్యవస్తమార్చి
చరిత్రగతిని
ముందుకు నడిపే
చలన శీలురకు
త్యాగ వీరులకు
స్థానం ఎక్కడ
ఉరికొయ్యలలొ
చెరసాలలలో
ఎంకౌంటర్లొ
ఎదకోతల్లో
వెలివేతల్లో
కదిలొస్తావా
కలిసొస్తావా
ఎదలోతుల్లో
రాద్దామిప్పుడు
సోహలిజం
సాధనలో
సమిధలయిన
శక్తులకు
సమున్నత
స్థానమిచ్చి
చరిత్రకే వన్నె తెచ్చే
చైతన్యపు గురుతులుగా
Friday, 26 April 2013
|క్షణప్రభ
క్రాంతి శ్రీనివాసరావు ||క్షణప్రభ ||
విరుద్ద శక్తుల
సమాహారం లో
విభిన్న రీతుల
సయ్యాటలలే
విచిత్రి గొలిపే
ఈ ప్రకృతిలో
కాలం ఒకేలా
ఉన్నా
మనసుకు
ఉక్కపోత తప్పదు
ఉసురుకు విసుగేసి
మెప్పదు
సంధ్యలు కొట్టే
వెలుగూ చీకట్ల
చప్పట్లు లేకుంటే
ఆనందం
తెల్లారిపోతుంది
సంతోషం
అమావాశ్య
దుప్పట్లు కప్పుకొంటుంది
అమరగాన మయునా
శబ్ధం నిశ్సబ్ధం
ఒకదానికొకటి
తోడులేకుంటే
మోడువారి పోతుంది
మొనాటినీతో
మనసు పారిపోతుంది
నీలొపలి
నీవు ఇంకో నీవు
వ్యతిరేకంగా ఉండి
వాదులాడుకొంటేనేగా
వాస్తవాలు వెల్లడయ్యేది
Thursday, 25 April 2013
|ఫిఫ్టీ ప్లస్ ||
క్రాంతి శ్రీనివాసరావు ||ఫిఫ్టీ ప్లస్ ||
ఓ చల్లని సాయంకాలం
ఆకాశపు నేపద్యం లొ
చెట్టు చివరి ఆకులకు
చూపులు చుట్టుకొని
ఇంకా ఈదాల్సిన
దూరాల అంచులు దూసి
మనసు దోసిళ్ళలో
పోస్తుంటే
కాలం పంపిన దూతగా వచ్చి
నెత్తిపై వాలిన
వానచినుకు
టప్ మనే వార్ణింగ్ బెల్
మాడుపై మ్రోగించి
వయసు సంఖ్యను వేసింది
ఊడిన వెంట్రుకల సాక్షిగా
అమ్మ తెలుసు
అమ్మమ్మ తెలుసు
అమ్మమ్మ అమ్మ తెలిసు
బిడ్డ తెలుసు
బిడ్డ బిడ్డ తెలుసు
నాకళ్ళ ముందే
ఐదు తరాల ప్రయాణం
అయునా ఎందుకో
అన్నీ నిన్నే జరిగినట్లు
ఇంకెన్నో రోజులున్నట్లు
నేనింకా మొదలెట్టాల్సిందేది
మొదలెట్టనే లేదు
ఆశలు
కళ్ళకు అడుగు దూరంలో కట్టుకొని
అనవరతంగా అతివేగంగా
తీసిన పరుగుల మరుగున దాగి
అర్ధ శతాబ్ధపు హద్దులు దాటా
అందుకే
కాలాన్నిప్పుడు
అర్ధ క్షణాలుగా పావు క్షణాలుగా
అతి జాగ్రతగా ఖర్చు పెట్టుకొంటున్నా
జరుగుతున్న సమయం లోనే బతికి
అందినంత ఆనందం జుర్రుకొంటున్నా
ఎర్ర పొన్నుగర్ర
క్రాంతి శ్రీనివాసరావు ||ఎర్ర పొన్నుగర్ర ||
ఆమె
మలిగే దీపపు వెలుగుల్లో
తొలిగే చీకటి తొందరలా
నడిచే పడవల తోవల్లో
మళ్ళీ కలిసే పాయల్లా
తరిగీ పెరిగే వెలుగుల్లో
తోచీ తోచని దారుల్లో
ప్రేమకు ఫ్రేములు కట్టేసి
పెండ్లికి పీటలు వేసేస్తే
ఆపై
ధోరణి బట్టలు విప్పేసి
దుః్ఖపు చాయలు కప్పేస్తే
నవ్వుల మొక్కకు
పువ్వులు రాలి
ఊహల రెక్కకు
ఈకలు ఊడి
ఒంటరి జంటలొ
జంటలొ ఒంటరై
జాగారపు రాత్రుల్లో
జనియించే వెదనలో
జనచక్షువు వెలుగులకై
పెనుగులాట వెదుకులాట
ఆదర్శపు దీపానికి
అడుగునున్న చీకటిలొ
పీకులాట వదిలేసి
పాకులాటలాపేసి
వెదుకులాట వెదుకులాట
అయునా సరె
ఆమిప్పుడు
అమ్మతనపు ఔదార్యం
పరిమళంగ పూసుకొన్న
మందారపు పూల గుత్తి
దేహంలొ మండుతున్న
నరాలతో పేనుకొన్న
వెలుగు లిచ్చి కాలుతున్న
ప్రేమదారాల లాంతరువత్తి
Tuesday, 23 April 2013
అక్షరాల వేలిముద్రలు
క్రాంతి శ్రీనివాసరావు ||అక్షరాల వేలిముద్రలు ||
ఒక వాక్యం చెరకుగడ
నమిలి తినెయ్యొచ్చు
ఒక వాక్యం మిరపకాయ
కొరికి భరించవచ్చు
ఒక వాక్యం చేదు విషం
విడిచి సహించవచ్చు
అలా సహిస్తూ భరిస్తూ
అక్షరాలు నములుతున్నప్పుడు
అనుకోకుండా ఒకవాక్యం
వొళ్ళువిరుచుకు
నిలబడుతుంది
వక్ర భాష్యాలకు
తిక్క విన్యాసాలకు
తనిఖీ దారుగా
కొత్త భావాలతో
మెరిసే తారగా
అదే
కవిత్వపు ఆనవాలుగా
ఆయువు పట్టుగా
అజరామరమై నిలుస్తుంది
అక్షరాస్త్రాలు విడుస్తుంది
కొత్త దారులు తెరుస్తుంది
అందుకే మనపెన్నులో
నిన్న లుంటాయి
భవిశ్యత్తుకు కన్నులుంటాయి
దుస్టత్వంపై పేల్చేందుకు గన్నులుంటాయి
చిన్నెలుంటాయి కొత్త వన్నెలుంటాయి
తీరిగ్గా నడచి వెళ్ళేందుకు ఇసుక తిన్నెలుంటాయి
వెన్నుతట్టే దన్నునిలిచే చేతులుంటాయి
కన్న తల్లి ఋణం తీర్చే
మన్ను వాసన మహిమలుంటాయి
నిన్ను నన్ను కలిపి నిలిపే
ఎన్నికయున మాట లుంటాయి
అందుకే మరందుకే
కవిసంగమంలో సంగమిద్దామా
కొత్తకవితగ చి్గురులేద్దామా
Sunday, 21 April 2013
|రహస్యాల రంగుల చిత్రం ||
క్రాంతి శ్రీనివాసరావు ||రహస్యాల రంగుల చిత్రం ||
వాడికి వెన్నెల్లో తడిచి
ప్రేమ జలుబు చేసింది
వాడికి ఎండల్లో కాగి
వేదాంతం అబ్బింది
వాడికి పొరుగింటి గాలులు తోలి
వింత పైత్యం చేసింది
వాడికి పాత నీతి సుత్రాలు తిని
బుర్ర కలుషితమై పోయింది
వాడికి ఉన్నానని చెప్పుకొనేందుకు
వెర్రి శబ్ధాలు చెయ్యడం అలవాటయుపోయింది నాలాగా
నేనింకా ఆపనేలేదు
అబ్బో
వాడి కప్పుడే కోపమొచ్చింది
గాంధీని బుద్దుడుని గుర్తు చేస్తున్నాడు
మహాత్ముల నందరినీ
అద్దాల బీరువాల్నిండా పెట్టి
ఆదర్శం అదని ఉట్టిలో దాచిపెట్టా్డుగా మరి
పాపం వాడు మాత్రం ఏం చేస్తాడులే
వాడూ సగటు తనం లోనే కదా
ఈదులాడుతున్నది
వాడే
వెనక్కి చూడకుండా
అంతరిక్షాన్ని చీల్చుకొంటూ వెళ్ళిపోతున్నాడు
అణువు అంతర్ల్లోకాల్లోకి దూసుకెళుతున్నాడు
రహస్యాల రంగుల చిత్రం గీస్తున్నాడు
వాడే
తెలివి సంద్రంలో
తెప్పలపై తీరం దొరకక తిప్పలు పడుతున్నాడు
మళ్ళీ వాడే
బొబ్బిలి వీణలు పిల్లనగ్రోవులు
కీ బోర్డులో పలికించినా
నాదాలు అవే అయ్యు నిందచెంది
జ్నానం రెప్పలపై నిలబడి
అప్పుడప్పుడూ
నిద్దురపోతున్నాడు
Saturday, 20 April 2013
||కలనేత ||
క్రాంతి శ్రీనివాసరావు ||కలనేత ||
నిద్దుర రాత్రికి విడాకులిచ్చి
వెలుగును పెడ్లాడింది
మెలుకువ పగటితో పడలేక
చీకటిని కౌగలించుకొంది
మిగిలిపోయిన జ్నాపకాలే
జ్నానంగా
గంతలు కట్టిన అనుభూతులు
అనుభవంగా
కొడవళ్ళు నూరిన
బండపై కూర్చొని
మోకాలి చిప్పలపై
బాల్యం రాసుకొన్న
ఆత్మ కధ చదువుకొంటూ
స్వప్నం చీల్చిన
చీకటి కిరణాల రంగులతో
హోలీ పండగ చేసుకొంటూ
తననీ మేధావి గానే
లెక్కలు కడుతున్న
సభ్య సమాజ సౌజన్యాన్ని చూసి
పఠంకట్టిన సర్టిఫికెట్లను
బద్దలు కొట్టకుండా బద్దకిస్తూ
బతుకీడుస్తూ............
ప్రపంచమంతా
ఒకటవుతుందంటున్న వేళ
తను మాత్రం పరాయివాడై
వెలుగూ చీకట్ల
కలనేత దుప్పట్లు కప్పుకొని
కాలం
పుష్పించే సమయం కోసం
ప్రశ్నల విత్తులు నాటుకొంటున్నాడు
Friday, 19 April 2013
|చీకటి సముద్రపు ఈల||
క్రాంతి శ్రీనివాసరావు ||చీకటి సముద్రపు ఈల||
రోజంతా
చేతులూపుతూ
నడుస్తూనే ఉన్నా
ముందు కాసేపు
నాముందు
నాతో కాసేపు
వెనుక మరికాసేపు
నడుస్తూనే ఉంది
తరుగుతూ
అటుపై
పెరుగుతూ
చిక్కనవుతూ
పలుచనవుతూ
ఏ చింతా లేకుండా
నడచి వెళుతుంది
నా నడక పూర్తయి
నడికూడలిలో
నిలబడగానే
సాదృశ్య రూపాల
సమాహారమై
వింజామరగా మారి
విశ్రాంతి తీసుకో మన్నది
బయటి ఎండలేని తనం
లోపలి అండలేని తనం
Thursday, 18 April 2013
విముక్తి కోసం
క్రాంతి శ్రీనివాసరావు ||విముక్తి కోసం||
నా కెందుకో
ఇనుప సంకెళ్ళు పడ్డవాళ్ళనే
సౌక్యం వరించిందేమో ననిపిస్తుంది
రోజుల్లోనో నెలల్లోనో
వారాల్లోనో వత్సరాల్లోనో
విడుదలవుతుంటారు
వాళ్ళకు
కాళ్ళకు చేతులకే
మరి నాకెందుకిలా
కాళ్ళూ చేతులతో పాటు
చూపులకు చేతలకు
చెవులకు చెప్పేమాటలకు
వజ్ర సదృశ వింత సంకెలలు
నోరు తెరిచినప్పుడల్లా
పగిలిన నా శకలం
గొంతులో అడ్డంగా కూర్చొని
అనిపించింది కాక
మరొకటి చెప్పిస్తున్నప్పుడల్లా
నాలుక రెండుగా చీలిన వేదన
చూడాలనిపించినప్పుడల్లా
చూపులు విరగ్గొడుతున్న
అర్ధం లేని అంతర్చేతన
కార్చ్చిచులా కాల్చుతున్న భావన
వినాలని్పించినా
కర్ణభేరి వీపుతట్టి
వద్దని వారించే
మనసు కవలపిల్ల
కలిగిస్తున్న కలవరపాటు
అడుగులు ఎటు మొలవాలో
చేతులు ఎటు నడవాలో
శాసిస్తున్న సైతాను
సహవాస వాసనల కంపు
కంపలో
ముళ్ళ గంపలో
మొహానికి అహం ముసుగేసుకొని
అలమటించే అందరికీ
సంకెళ్ళ మోత తప్ప
స్వేస్చా స్వచ్చతల
స్పటికపు మెరుపులు
సాక్షాత్కరించవు ఎప్పుడు
అవును నిజం
అహం జ్నానానికి
తోబుట్టువయునప్పుడాల్లా
అధిపత్యమై అఘోరిస్తుంది
వొంటి లోపలా బయట
చుట్టుకొన్న
శృంఖలాల చప్పట్లకు
చదవేస్తే ఉన్న మతి పోయినట్లు
అహాన్ని సర్జరీచేసి తీసేపారేసే
హాస్పిటళ్ళు కోసం
అహరహమూ వెతుకుతూనే ఉన్నా
ఈ అదృశ్య అరదండాల
ఆపద తప్పించుకొనేందుకు
మానస సరోవరాన్ని
మరింత స్వఛ్చంగా ఉంచుకొనేందుకు
Wednesday, 17 April 2013
|అగ్గితత్తడి ||
క్రాంతి శ్రీనివాసరావు ||అగ్గితత్తడి ||
నా కన్నుల్లో నేనే నక్కొని
రెక్కలు విప్పాల్సిన దృశ్యాలను
పెడరెక్కలు కట్టాల్సిన దృశ్యాలను
లెక్కలు వేస్తున్నా
అడ్డాలో తన్ను తాను
అడ్డంగా అమ్ముకొన్నా
అర్ధాకలిని
అర్ధనగ్నత్వాన్ని
ఆనంద క్షణాలుగా ఆవిరి పట్టుకొంటూ
శబ్ధాన్ని పోగొట్టుకొన్న
ఆర్తనాదాలు
మరణశయ్యపై బతుకుతూ
మాంసాన్ని పక్కగా పరచి
ఒకేసారి
ఇద్దరూ పొందాల్సిన సౌక్యం
ఒక్కడే దొంగిలించుకు
పోతున్నప్పుడు
అర్ధాన్ని విరగ్గొట్టుకొన్న
జీవపదార్ధాలు
అమ్మై భార్యై
ప్రేమను నిర్వచిస్తుంటే
అత్తై ఆడపడుచై
కత్తులు పట్టుకొని
మగస్వామ్యం చేతిలో
పనిముట్టయిన
చిత్ర విచిత్ర సంవేదనలు
పట్టాలు పొట్టలు నింపకుంటే
తల పోటీల వలలో
తల్ల డిల్లుతున్న
తరుణ వయస్కుల
మడి కట్టుకొన్న
తడి కన్నులు
అగ్గితత్తడి అవుతున్న
ఆగ్రహ క్షణాలు
నేటిని పారేసుకోని
రేపు వెతుక్కొందామనుకొనే
వాసన రాని శవాల
వార్ధ్యక్యపు జాడలు
జాలువారు శబ్ధాలు
తమకు తామే
బానిసత్వానికి దత్తతపోయి
సంకెలలు
అలంకార మనుకొనే
చాదస్తపు ఇంతుల
చెదపట్టిన మెదళ్ళు
దృతరాస్ట్ర కబందుని
కౌగిలింతల్లా
ఒక్కసారే
ప్రభుత్వ ప్రైవేటు అప్పుల
పరిస్వంగం లో
రాచపుండు మొలచిన
రాజకీయ క్షేత్రంలో
రైతులు
ఛిద్రమవుతున్న
సంధర్భాలు
బతుకు గురించి ఊసేలేని
బస్తాలకొద్ది పుస్తకాల మధ్య
బడి బంట్రోతులై
ర్యాంకులు మోస్తూ
అనర్ధ అలక్ష్య
దారుల వెంట
బాల్యపు నడుములు
అరిగించుకొంటున్న
భావి పౌరులను
పేలని బాణాసంచాలు చేస్తున్న
తెల్ల చీకటి తెంపరితనం
కళ్ళముందరి రంగుల తెర
హృదయపు రంగులు
మింగేస్తూ
మనసు నిండా
బ్లాక్ అండ్ వైట్
రీళ్ళు తిప్పుతుంటే
మనిషికీ మృగానికీ మధ్య
సరిహద్దు రేఖలు
చెరిగిపోయి
నేరం
కొత్త నాట్య భంగిమలు
నేర్చుకొంటున్న వైనాలు
ఎన్నో ఎన్నో ఎన్నో ఇంకెన్నో
ఇంకిన కళ్ళ్ నడగండి
ఎక్కడయినా కనిపిస్తే ఇంకెన్నో చెబుతాయి
Monday, 15 April 2013
|కొత్త కళ్ళజోడు |
క్రాంతి శ్రీనివాసరావు ||కొత్త కళ్ళజోడు ||
ఒంటరిగా
అద్దం ముందు
మూడొందలరవై డిగ్రీలలో
నిన్ను నీవు చూసుకొనేందుకు
ఎన్ని వంకరలు పోతావోకదా!
ఎందుకయ్యా
ఎదుటివాళ్ళనందరినీ
ఒక్క మాట పట్టుకొనో
ఒక్క చూపుతోనో
నిర్ధయగా నిర్ధారిస్తుంటావు
నిద్దురలో వచ్చిన
కలలో తప్ప
నీవు కన్నకలల లో
ఎన్నడూ
నీవూ నీవాడు తప్ప
ఒక్కసారన్నా
వేరేఎవరయినా హీరోగా వున్నాడా?
ఎందుకయ్యా
అందరూ స్వార్ధపరులని
శాపనార్ధాలు పెడుతుంటావు
నీకున్నది ఏదయినా
కనీసం
నీ అవసరానికి
రెండింతలు
మించిన దాన్నయినా పంచావా?
ఎందుకయ్యా
అందరూ వంచనపరులేనని
వూరికే వచిస్తుంటావు
ఎంతకాలం
నీపై నీవే
పంచదార పలుకుల
పలుకులు
చిలకరించుకొంటావ్
ఓ మనిషీ
ఏనాడయినా
నిన్ను నీవు
విన్నావా
నీఎద నిండా
ఎండుటాకుల చప్పుడు
భూమ్మీద నిలబడ్డ మనిషి
చందమామ వెనుక వైపు
చూడలేనట్లు
ఇంకెంతకాలం
మనిషి లోని మనిషిని
చూడకుండా ఉంటావ్
ఇదిగో
కవిత్వపు కళ్ళజోడు
లోపలి మనుషుల
జాడలు చూడు
నీ లోపలి నీడలనూ చూడు
నీలోని వాళ్ళను
వాళ్ళలోని నిన్నూ
పోగేసి పెద్ద జట్టు కట్టు
మనిషి పాటకు
సరికొత్త మానవత్వ
బాణీలను కట్టు
గ్లోబల్ దుస్టత్వం పై
దాడికి
తిరుగులేని
ఆయుధం పట్టు
|నా అక్షర ప్రేయసి
క్రాంతి శ్రీనివాసరావు ||నా అక్షర ప్రేయసి ||
నీ కోసం
వికసించిన పుష్పం
మళ్ళీ మొగ్గయి
మొన్నటిలా
మొక్కలో కలసిపోతే
గడ్డకట్టే చలిలోంచి
హఠాత్తుగా
మాడిపోయే వేడిలోకి
తలుపులు తెరుచుకొంటే
గాయపడనిది ఎవ్వరు
కన్నీటి వర్ష మేఘాలు
చుట్టూ కమ్ముకొన్నప్పుడు
దగ్గర ఉన్నవి తప్ప
మరేదీ కనపడని
దృశ్య ఏకాంతం లో
నిన్నటి స్వప్నకౌగిలి
నెమరు వేసు కొంటున్నప్పుడు
మొక్కలో కలిసింది
రాలిపోవడం ఇస్టం లేక
మళ్ళీ నీకై
పువ్వై పుట్టేందుకే నని
తలుపులు తెరిచింది
సమశీతోష్ణం
సర్దు బాటు చేసేందుకే నని
వెన్నెల పుష్పాల
ఆనవాళ్ళను
కొండవాలు తీగ
వ్యాకరణం లో పొదిగి
కవితా మాలగా మార్చి
వాలుచూపు కన్నులతో
కంఠాన్ని అలంకరించి
తానెన్నటికీ
జ్నాపకం కాకుండా
నిత్య వర్థమానమై
వర్ధిల్లుతానని
మాటల తేనె పట్టును
మళ్ళీ మళ్ళీ
నీకోసం పెడతానని
చూపుల కన్నీళ్ళు తుడిచి
బాస చేసి వెళ్ళింది
కాదు కాదు నాలోనే దాక్కుంది
నాలోలోనే దాక్కుంది
Saturday, 13 April 2013
||సగటు మనిషి సంగీత కచేరి ||
క్రాంతి శ్రీనివాసరావు ||సగటు మనిషి సంగీత కచేరి ||
చీకటి విరిగి పోతుంది
తునకలు తునకలుగా
మరకలు మరకలుగా
శబ్ధం పగిలిపోతుంది
పొరలు పొరలుగా
పగుళ్ళలో అరుపులు
మొజాయిక్ లా
కొత్త మ్యూజిక్
ఆగిఆగి జారుతుంది
గంతులేస్తూ గొంతులోకి
గరళ మేదో
అణువు అణువుకు
నాట్యపు తడి
కట్టుగొయ్యలు
తెంపుకొన్న మాటలు
నెత్తిమీద కిరీటాలు
సగం చీకటి ఊడ్చిన
వెలుతురు చీపుళ్ళు
కుప్పలు కుప్పలు ధైర్యం
వడ్డీలేని అప్పుగా
సమర్తాడుతున్న సమయం
మీసాలొస్తున్న నిముషాలు
సోపానాలపై స్వప్నాలు
నాలుక రాస్తున్న
పేపర్లు దిద్దలేక
లివరు అలసిపోతోంది
అయినా సరే
ఆశల చివర్లు పట్టుకొనేందుకు
అప్పుడప్పుడు అలా అలా అని
సంజాయిషీ ఇచ్చుకొంటూ
ఉదయపు శిరోభారాన్ని
మోయడానికి సిదమైన
సగటు మనిషి
సంగీత కచేరీ సాగుతోందక్కడ
Friday, 12 April 2013
||ఊరవతల ఉగాది ||
క్రాంతి శ్రినివాసరావు ||ఊరవతల ఉగాది ||
ఊరవతల ఉగాది
ఉత్సాహపు వురవళ్ళు తొక్కుతోంది
మా ఊరికి రమ్మని ఆహ్వానిస్తూ
ఇటు చూస్తే
మాఊళ్ళో మామిడి పిందెలు
ముకుళిత హస్తాలతో
గాలిదుమ్ముకూ,వడగళ్ళ వానకూ
మొక్కుతున్నాయి
కోయిల గొంతుకు
రాజధాని నడిబజారులో
నిర్భయ ఆర్తనాధాలు
అడ్డుపడుతున్నాయి
వేప చెట్టు పూత
విస్మయ పడిపోతుంది
తనకంటే చేదు
జనజీవితం లో
దిల్ షుక్ నగర్ పేలుళ్ళై
కలిసిందని
చెక్కెర సిగ్గుపడుతోంది
మనసు మసలి మసలి
మధుమేహం గా
వొంటినిండా పొంగిపొరలుతున్న
నాలుకలు తాకేందుకు
ఉప్పూ బిడియ పడుతోంది
రక్తం వేసే ఉరకలు చూసి
వగరు మాత్రం వయ్యారం
వొలక బోస్తోంది
ఉన్న దంతా తన దందాయేనని
ఏంచెయ్యాలిప్పుడు
మాకన్నీ క్షయ నామ సమ్వత్సరాలే ఎప్పుడు
మనలోంచి మనమే మేల్కొని కొత్త సృష్టి చెయ్యాలిప్పుడు
ఊరవతల ఉగాది
ఉత్సాహపు వురవళ్ళు తొక్కుతోంది
మా ఊరికి రమ్మని ఆహ్వానిస్తూ
ఇటు చూస్తే
మాఊళ్ళో మామిడి పిందెలు
ముకుళిత హస్తాలతో
గాలిదుమ్ముకూ,వడగళ్ళ వానకూ
మొక్కుతున్నాయి
కోయిల గొంతుకు
రాజధాని నడిబజారులో
నిర్భయ ఆర్తనాధాలు
అడ్డుపడుతున్నాయి
వేప చెట్టు పూత
విస్మయ పడిపోతుంది
తనకంటే చేదు
జనజీవితం లో
దిల్ షుక్ నగర్ పేలుళ్ళై
కలిసిందని
చెక్కెర సిగ్గుపడుతోంది
మనసు మసలి మసలి
మధుమేహం గా
వొంటినిండా పొంగిపొరలుతున్న
నాలుకలు తాకేందుకు
ఉప్పూ బిడియ పడుతోంది
రక్తం వేసే ఉరకలు చూసి
వగరు మాత్రం వయ్యారం
వొలక బోస్తోంది
ఉన్న దంతా తన దందాయేనని
ఏంచెయ్యాలిప్పుడు
మాకన్నీ క్షయ నామ సమ్వత్సరాలే ఎప్పుడు
మనలోంచి మనమే మేల్కొని కొత్త సృష్టి చెయ్యాలిప్పుడు
నీలోకి
క్రాంతి శ్రీనివాసరావు || నీలోకి ||
ఆలోచన పట్టుకోవాలని
పైకో కిందికో పక్కకో
చూపులు నిలబెడుతుంటాం
ఇంకా సాధ్యం కాలేదనుకొంటే
రెప్పలు కప్పేస్తుంటాం
కాసేపు
నీ ఊపిరి పక్కకు జరిపి
వేరే ఊపిరి లోనికి తీసుకో
శరీరమంతా మనసేఅయు
భూమ్యాకర్షణ దిక్కరిస్తూ
దూది పింజలా మారిపోతుంది
కొత్త ఊపిరి కొత్త ఇల్లులో
గది గదిని పలక రించి
పరిమళించడం నేర్పుతుంది
నీలో నీవేఉన్నప్పుడు
నీకు తెలియని కోణాలను
బాణాల్లా సంధించి
బాధపెడుతుంటావు
నీలోపల నీకే
గుచ్చుకొన్నప్పుడల్లా
బాధపడుతుంటావు
వీలు చేసుకొని
ఆకాశానివైపో
ఆకాశం దాటి అనంతానివైపో
కాలాన్ని శ్వాసిస్తున్న ప్రకృతివైపో
హృదయాన్ని
చిగురిస్తున్న ఆకుల తాజాదనంలో
నీవు చేరగలిగిన
హద్దులెరుగని ఆకాశపు సరిహద్దుల్లో
నిన్ను నీవే ఉతుక్కో
తిరిగి నీలోకి నీవు తరలిపో
కరగిపో కాలిపో
నీవే కార్చిచ్చు వైపో
వడకట్టుకొని
వెలుగులు కప్పుకొని
తిరిగి నీలోకి నీవు తరలిపో
నీవే తనయి
నీలోని తనూ నీవు జతయిపోతే
పరిమలిస్తున్న నులివెచ్చని మంటలు
బాధల శీతల తలాలలై చల్లిపోతాయి
శరీరమంతా మనసయునప్పుడు
వయసయుపోవడమనేది లేనేలేదు
నీ స్టేషనులో నీవు దిగిపోవడం తప్ప
Wednesday, 10 April 2013
|మొదటి ఒకటో తారీఖు ||
క్రాంతి శ్రీనివాసరావు ||మొదటి ఒకటో తారీఖు ||
బ్రహ్మ సృష్టి మొదలెట్టిన రోజంటూ
కొత్తదనం లేకుండా
ఇంకా వరహమిహిరుడి
పంచాంగమే పఠిస్తున్నాం
కొత్త సంవత్సరాన్ని
అర్ధరాత్రి ఆహ్వానించడం నేర్పి
ఉషోదయాన ఉగాదిని పిలవమంటే ఎలా
సాంస్కృతిక పునాదులు
కదులుతున్న చప్పుళ్ళ మధ్య
సంవత్సరాది అంటూనే
ఉగాది వచ్చే రోజు కోసం
తేదీలను వెతుక్కొనే
చాదస్తపు చిత్తసుద్దిలో ఉన్నాం
కాలం చెట్టు
మారాకు వేసేవేళ
చిగుళ్ళను తెంపుకు తింటూ
పక్షం రోజులకు రాలిపోయే
టేస్ట్ బడ్ లకు
మొదట అనుభవమైన రుచిని
సంవత్సర జీవితానికి ఆపాదించుకొంటున్నాం
వేప చిగురులు తినిపించి
వేదన భరించడం నేర్పాలిప్పుడు
కవి పెన్నులలో ఆగిపోయిన ఉగాదిని
జాతి జనుల కన్నులలో పోయాలిప్పుడు
వసంతాన్ని సొంతంచేసుకోవడం
నేర్పాలిప్పుడు
ఉగాదిని
పునఃసృష్టి చెయ్యాలిప్పుడు
ఏది మొదటి ఒకటో తారీఖో
తేల్చాలిప్పుడు
Tuesday, 9 April 2013
||ప్రేమ సవ్వడి ||
క్రాంతి శ్రీనివాసరావు ||ప్రేమ సవ్వడి ||
ఓక ప్రశ్న
ప్రేమగా తాకింది
నన్నెందుకు ప్రేమిస్తున్నావని
ప్రేమించబడుతున్న సంగతి తెలిసి
ప్రేమగా అడిగే ప్రశ్న
సమాధాన రూపం లో
మరింత ప్రేమను
పొందుకొనేందుకే
ఏవోకొన్ని కారణాలతో కొలిచి
ప్రేమకు వెలకట్టడం చేతగాక
కాస్తంత మౌనం అద్దుకొని
ప్రశ్నకు మరోప్రశ్నను
కుడి ఎడమకు తిప్పి
ఎదురుగ అంటించి
అందమయిన
హృదయపు బొమ్మగా మార్చి
బహుమతిగా ఇచ్చేసా
ప్రేమంటే నమ్మకమంటారు గానీ
నాకెందుకో నచ్చదు
కాస్తంత సందేహం మిగుల్చుకొంటేనే
రోజుకు పదిసార్లన్నా ప్రదర్శించుకొంటాం
ఐలవ్‌యు మంత్రాన్నిఅదేపనిగా జపించుకొంటాం
కారణాలు లేని
బలాన్ని బలహీనతను
సమానంగా స్వీకరించగలిగే
ఒకానొక స్నేహసంబంధం ప్రేమంటే
అందుకే
పెన్సిల్‌కు మల్లే
ప్రేమకూ షార్ప్ నర్ కావాలి
కాల యవనికపై ప్రేమ కావ్యాలు రాసేందుకు
Monday, 8 April 2013
|సందర్భం |
క్రాంతి శ్రీనివాసరావు ||సందర్భం ||
సందర్భాలు
ఎవరెవరికో ముడి పెట్టి
చరిత్రలో విడుదలయి
సజీవమై పోతుంటాయి
ముడి విప్పుకొన్నా
అట్టేపెట్టుకొన్నా
ముడి వేసిన ముద్రలో
శాశ్వతమై పోతుంటాయి
వానకురిసి వెళ్ళాక
చిత్తడి నేలలో
నడవాల్సిన అవసరం
లేనట్లయితే
ఆకాశపు అందాన్ని
చూడాలని ఎవరికుండదు?
ముడి పడ్డాక
మనసుపోగొట్టు కొన్నాం
అంటారుగానీ
నిజానికి మరో మనసుని
తగిలించుకొంటాం
అది చెప్పే గుసగుసలు
వొంటరితనం వొళ్ళో తలపెట్టుకొని
వింటూ ఉంటాం
తలుపులు తట్టే
అవసరం లేకుండా
తలపుల వాకిళ్ళు
తెరిచే ఉంచుకొంటాం
మనసు
తననుతనే మంత్రించుకొని
లోపల జరుగుతున్న ఉల్కాపాతంలో
తడిసిపోతుంటుంది
సందర్భం స్కేలుగా
కాలం గీసిన గీతల మధ్య
నడచిపోతుంటుంది
|వేళ్ళు ముడిచిన హస్తాలు
క్రాంతి శ్రీనివాసరావు ||వేళ్ళు ముడిచిన హస్తాలు ||
కలలు లోపల పుట్టొచ్చేమో కానీ
పంట రాల్చేది బయటే
కలల విత్తనాలన్నీ
నీజీవన పరిసరాల్లోనే దొరుకుతాయి
నీ మనోక్షేత్ర సార స్తాయీభేదాలు
స్వప్నసౌరభాలను నిర్ణయిస్తాయి
సాకారమయున స్వప్నాలు
మళ్ళీ కలలగింజలై మొలుస్తాయి
కలలుకనటం
చెప్పుకున్నంత తేలికేం కాదు
కలలు ఖరీదయు పోయాయి
గ్లోబలై జేషన్
గురిచుసికొట్టే దెబ్బలకు
గుండెపగిలి
భంగపడ్డమనిషికలలు
అభద్రతా వరదల్లో
కొట్టుకుపోయాయి
ఇప్పుడు
కలకనడం పెద్ద కలైపోయుంది
ప్రాణంతో ఉండగనే
చర్మం వొలుస్తున్న వేదన
పలకరించి వెళుతుంటే
క్షణం క్షణం ఉలిక్కిపడుతు
కలలలోకి ఎలా నడవగలం
మనిషిని ఏమార్చేకలలు
మనకెందుకు
లోకాన్ని మార్చేకలలుకందాం
ఇదంతా కలయితే బాగని
బ్రమించ గలమేమో గానీ
రోగగ్రస్త జీవితాలను
శాంతిమయం చేయగలమా
కాసేపు తాకినంత మాత్రాన
తారుమారు చేయగలమా
శాంతిఅంటే యుద్దంగెలిచాక వచ్చేకాంతి
అందుకే
ఏళ్ళ తరబడి పోరాటానికి సిద్దపడ్డ
వేళ్ళు ముడిచిన హస్తాలు కావాలిప్పుడు
Sunday, 7 April 2013
||ముకుతాళ్ళు
క్రాంతి శ్రీనివాసరావు ||ముకుతాళ్ళు ||
చూపులలో
రంగులే కాదు
రసాలు వుంటాయి
క్రాస్ సెక్షను చేస్తేతప్ప
కానరావు
చూపుల
అడ్డుకోతల అర్ధాల
నిఘంటువే
బతుకు పుస్తకం
మాటల అర్ధాలు
మారుతుంటాయి
అవి బిగించబడ్డ
వాక్యాల నీడల్లో దాగున్న
హృదయబాషను బట్టి
ఉద్దేశాలు
ఊపిరి పోసుకోక ముందే
మలినాలను పసిగట్టాల్సిన భైరవులు
బతుకు బండిచక్రాలు
చేష్టలు చెప్పేవన్నీ
నిజాలు కానవసరం లేదు
ఎరవేసేవి ఎరిగించేవి
ఏవయినా అవ్వొచ్చు
జీవిత అనుభవాల
మొట్టికాయల నడిగి
గుట్టు విప్పుకోవాలి
కనుకనే
కాలంపై ముద్రించిన
గాధల్ల్లో వెతికి
వ్యర్ధాలకు అర్ధాలకు
తేడా తెలుసుకోవాలి
బతుకుదారులు
బాగుచేసుకోవాలి
అందుకే అందరం
మన ముచ్చట్లకు
ముకుతాళ్ళు బిగిద్దాం
మునుముందుకు నడిపేలా
మనుషుల్లా గడిపేలా
ఏమార్చలేనితనం
క్రాంతి శ్రీనివాసరావు ||ఏమార్చలేనితనం ||
భయాన్ని
భయపెట్టేందుకు
నేచుట్టుకొని పట్టుకొనే
మహత్తర ఆయుధం
పాదాలను పీఠచేసి
మోకాళ్ళ దిండువేసి
ఉయ్యాలూపి
భూమితల్లి తీపిముద్దులు
తినిపించి
తప్పటడుగులకు
తోడునడచి
నాబతుకుకు
దారులు పరచేందుకు
మాకోసం తిరిగి తిరిగి
అరిగి తొలగిన
మోకాలి చిప్పలకు
చిప్పిల్లిన కళ్ళతో
వీడ్కోలు వందనాలు
నాన్నలో భాగమైన
కొత్తమోకాళ్ళకు
శతకోటి వందనాలు
మునిమనవళ్ళతో
పరుగులెట్టేందుకు
కొత్త మోకాళ్ళు
పెట్టు కొంటున్నాయి
నొప్పిని ఏమార్చలేనితనం
కడివెడు కన్నీళ్ళను పంచుకొన్నా
ఏమిలాభం?
ఇంత చేసిన నాన్నకు
ఎంతోకొంత చేసేందుకయినా
నొప్పిని బదలాయించుకొనే
మార్గం దొరికితే బాగు ............
Saturday, 6 April 2013
|సమాధి కంటే ముందు
క్రాంతి శ్రీనివాసరావు ||సమాధి కంటే ముందు ||
లోకం ఇంకా తెలియదు
లాగుల్లోనే ఉన్నప్పుడు
కాగితం పడవలో
మనసునెక్కించి
కాలువలెంట తిరిగేవాడిని
బిగించిన పిడికిళ్ళను
గాల్లోకి చాపి
మనసు
మోటార్ సైకిలెక్కితే
పరుగులు తీసేవాడిని
మనసు సర్దుకోగలదు
సమర్ధించుకోగలదు
అందనివో
అందుకోవాల్సినవో
ఎదురయినప్పుడు
కలల కౌగిలిలోనో
ఊహల ఉయ్యలలోనో
ఊరడించుకొంటుంది
తనను తనే
మోసం చేసుకొని
తనువుకు తాదాత్మ్యం
ఉన్నచోటే ఉంచి
అంతరిక్ష ప్రయాణ
అనుభవం ఇవ్వడం
అనవసరమయునవి
అంటించుకొని
అలమటించడము అలవాటే
తనగురించి
తనే రాసుకొంటూ
ఎక్కడో మొదలయి
మరెక్కడో విడుదలయి
తప్పించుకు తిరగడము
హఠాత్తుగా దిశను మార్చి
శూన్యం లోకో
సుడిగుండం లోకో
విసిరేసుకోవడము
తెలుసు
తనే రెండుగా చీలి
చెప్పేదితానే
వినేది తానేఅయ్యు
ఇలా రాయుంచడము
తెలుసు
>>>>>>>>>>>>
ఇప్పుడిక ఆపెయ్యు
నేనుండే చోటు వెతుక్కోవాలి
మళ్ళోకసారి మాట్లాడుకొందామన్నది
మరి శెలవా.............
Thursday, 4 April 2013
పుష్పించే క్షణాలు ||
క్రాంతి శ్రీనివాసరావు || పుష్పించే క్షణాలు ||
ఒక కవిస్వాగతం
ఆకుల అంచుల నుండి
పొర్లుతున్న పండువెన్నెల
స్వరాలాపనలా అలరించింది
ఆరుతున్న చెమట చుక్కల
చల్లదనాన్ని మైమరపించింది
అక్కడ
ఎప్పుడూ మాట్లాడుకొనే
మాటలే అయునా
హృదయాలలో
ముంచి తీసినప్పుడు
వెలుగును మోసుకొచ్చాయి
అవి నా
గుండె గోడల కంటిన
చీకటిని దులుపేసాయి
అక్కడ మౌనం కూడా
నాతో మాట్లాడింది
వీడ్కోలు క్షణాలు
మరలా కలిసే క్షణాలెప్పుడని
లెక్కలు వేసుకొన్నాయి
కాలానికి పరిమళాలద్దే
పుష్పించే క్షణాలు
దాచుకొనేందుకు కోసుకొని
కరిగి
కాగితాలకు అంటుకొన్న
హృదయం
వెంటతెచ్చుకొన్నాను
మళ్ళీ మళ్ళీ
మాట్లాడుకోవచ్చని
Wednesday, 3 April 2013
రెప్పల చప్పుడు |
క్రాంతి శ్రీనివాసరావు ||రెప్పల చప్పుడు ||
రెప్పలు చప్పుడు చేస్తూ
పగలంతా కాకుల్లంటి కలల్ని
తోలుతూనే ఉంటాయి
అలసి ఆగిన వెంటనే
కన్నుల్లో జొరబడి
మనసు పంట చేనును
మేసిపోతుంటాయి
ఎంతో వ్యవసాయం చేసి
పండించిన తృప్తి
తరుణానికి రాక ముందే
తరలిపోతుంటుంది
ఆశల కలుపు మొక్కలు
నిద్దుర తడి తగిలి
వద్దన్నా పెరిగిపోతుంటాయి
అన్ని మయూరాలు
అందంగానే ఆడుతాయి
గిజిగాళ్ళన్నీ
ఒకేలా గూడు కడతాయి
అన్ని కోయిలలూ
కమ్మగనే కూస్తాయు
మనిషెందుకో
సాధన చేస్తే తప్ప
ఏమీ సాధించలేడు
నెమళ్ళూ కోయలలు
గిజిగాళ్ళే కాదు
సమస్త ప్రాణుల
సర్వ లక్షణాలు
పొదిగిన జీవులు
మనుషులంతా
అందుకే మనం
మనుషులను
మనుషుల్లా కాకుండా
కుక్కలని
కోతులని
గుంటనక్కలని
జంతువులు గానే పిలుస్తుంటాం
మనిషి లో మనిషితనం
మిగలాలంటే
మనిషిని మనిషిగానే
పిలవాలంటే
సాధనా చెయ్యాల్సిందే
నిరంత శోధనా చెయ్యాల్సిందే
కను రెప్పల చప్పుడు
ఎప్పుడూ మ్రోగుతు ఉండాల్సిందే
Tuesday, 2 April 2013
తెగిపడ్డ ఆర్తనాదం||
క్రాంతి శ్రీనివాసరావు ||తెగిపడ్డ ఆర్తనాదం||
హఠాత్తుగా
నిద్రను వెలివేసి ఎరుపక్కిన
రెండు కళ్ళు
జిస్టిబొమ్మ మొహం మీది
సుద్ద ముక్క గీతల నవ్వు
అట్టలు కట్టిన అమ్మోరి జుట్టూ
వేలాడే మసిగుడ్డపై మొలిచి
ఉలిక్కి పడేలా చేసింది
అది
బతుకు పరుగులో
జారిపడ్డ వృత్తాంతం
అది ఒక తెగిపడ్డ ఆర్తనాధం
డేగలు రాజ్యంఏలు తున్నా
పాములు పడగలు విప్పుతున్నాయి
జీవిత వైకుంటపాళీ లో చేరి
మనుషులను
నిచ్చెన మెట్లు దింపుతున్నాయి
అక్కడ
అప్పు చేయడం కూడా
ఒక అవసరం
క్రమం తప్పకుండా తీర్చడమే
పనికొచ్చే పెద్ద పరపతి
చేస్తున్నపని గద్దలెత్తుకుపోతే
పంచరంగుల పరుగుల్లో
క్రెడిట్ కార్డుల సుడిగాలుల్లో
సర్వం కోట్టుకుపోయు
మోడ్రను ఆర్ట్ శిల్పాల్లా
నడికూడళ్ళలో వెలుస్తుంటారు
మౌనం ముసుగేసుకొని
హోం లెస్
జాబ్ లెస్
హంగ్రీ అంటూ
అర్హత పత్రాలు అడ్డంగా పట్టుకొని
అడుక్కొంటూ ఉంటారు
అక్కడక్కడా........
అమెరికా ఆర్ధిక వ్యవస్థ
బెర్ముడా ట్రయాంగిల్ లో
విసిరేసినా వెనక్కి తిరిగొచ్చే
బూమరాంగ్ అనుకొంటారంతా
దానికీ కోకొల్లల అప్పుల తిప్పలు
అదికూడా కొందరికీ
సైబీరియా లోని బైకాల్ మంచినీటి సరస్సే
Monday, 1 April 2013
|పునరావేశం ||
క్రాంతి శ్రీనివాసరావు ||పునరావేశం ||
కొంచెం మాసిన గెడ్డం
తెల్లని పంచా
మోచేతులదాకా ముడిచిన చొక్కా
ఎనభై ఏళ్ళ నల్లని
వొత్తయిన జుట్టూ
పోతపోసిన ధైర్యం
నాకెంతో ఇస్టం
ఎందుకో తెలుసా?
పచ్చనిమొహం
చెదరని చిరునవ్వు
నిలువెత్తు శుభ్రం
అన్నిటినీ ఆహ్వానిస్తూనేమో
ఎప్పుడూ సన్నగా కంపించే తల
నా కెంతో ఇస్టం
ఎందుకో తెలుసా
వాళ్ళు
నా అమ్మానాన్నలు
అది నాకో ప్రేమలోకం
అందుకే నేనంటాను
నీదంటూ నీకంటూ
కొన్ని ప్రేమలోకాలుంటాయి
వెదుకు
వాళ్ళు
అసలు మనుషులే కాక పోవచ్చు
కానీ
అక్కడన్నీ ఇస్టాలే ఉంటాయి
ఆ
పేమాయస్కాంత లోకం చుట్టూ
రోజూ కాసేపు తిరుగుదాం
అప్పుడు
అక్కడ పుట్టిన కరెంటుతో
మనని మనం
రీచార్జ్ చేసుకొందాం
బలమయిన మనసుతో
మళ్ళీ
జీవిత బరిలోకి దిగుదాం
మన లోపల్లోపలా
జ్నానేంద్రియాల చుట్టూతా
గమనించాల్సింది ఎంతో ఉంది
గ్రహించి పరిగ్రహించుదాం
ఎవని కోసమో
ఎంతకాలం చప్పట్లు
రాల్చుకొందాం
మనపైనా
కొన్ని చప్పట్లు
కురిపించుకొందాం
ఆకుపచ్చ గీతంలా
మనమూ
పరవశిస్తూ
పరవశాన్ని పంచుదాం
Subscribe to:
Posts (Atom)