క్రాంతి శ్రీనివాసరావు ||నా అక్షర ప్రేయసి ||
నీ కోసం
వికసించిన పుష్పం
మళ్ళీ మొగ్గయి
మొన్నటిలా
మొక్కలో కలసిపోతే
గడ్డకట్టే చలిలోంచి
హఠాత్తుగా
మాడిపోయే వేడిలోకి
తలుపులు తెరుచుకొంటే
గాయపడనిది ఎవ్వరు
కన్నీటి వర్ష మేఘాలు
చుట్టూ కమ్ముకొన్నప్పుడు
దగ్గర ఉన్నవి తప్ప
మరేదీ కనపడని
దృశ్య ఏకాంతం లో
నిన్నటి స్వప్నకౌగిలి
నెమరు వేసు కొంటున్నప్పుడు
మొక్కలో కలిసింది
రాలిపోవడం ఇస్టం లేక
మళ్ళీ నీకై
పువ్వై పుట్టేందుకే నని
తలుపులు తెరిచింది
సమశీతోష్ణం
సర్దు బాటు చేసేందుకే నని
వెన్నెల పుష్పాల
ఆనవాళ్ళను
కొండవాలు తీగ
వ్యాకరణం లో పొదిగి
కవితా మాలగా మార్చి
వాలుచూపు కన్నులతో
కంఠాన్ని అలంకరించి
తానెన్నటికీ
జ్నాపకం కాకుండా
నిత్య వర్థమానమై
వర్ధిల్లుతానని
మాటల తేనె పట్టును
మళ్ళీ మళ్ళీ
నీకోసం పెడతానని
చూపుల కన్నీళ్ళు తుడిచి
బాస చేసి వెళ్ళింది
కాదు కాదు నాలోనే దాక్కుంది
నాలోలోనే దాక్కుంది
No comments:
Post a Comment