Saturday, 13 April 2013

||సగటు మనిషి సంగీత కచేరి ||


 క్రాంతి శ్రీనివాసరావు ||సగటు మనిషి సంగీత కచేరి ||


     చీకటి విరిగి పోతుంది
     తునకలు తునకలుగా
     మరకలు మరకలుగా
   
     శబ్ధం పగిలిపోతుంది
     పొరలు పొరలుగా
     పగుళ్ళలో అరుపులు
     మొజాయిక్ లా
     కొత్త మ్యూజిక్

     ఆగిఆగి జారుతుంది
     గంతులేస్తూ గొంతులోకి
     గరళ మేదో
     అణువు అణువుకు
     నాట్యపు తడి

     కట్టుగొయ్యలు
     తెంపుకొన్న మాటలు
     నెత్తిమీద కిరీటాలు

     సగం చీకటి ఊడ్చిన
     వెలుతురు చీపుళ్ళు
     కుప్పలు కుప్పలు ధైర్యం
     వడ్డీలేని అప్పుగా

     సమర్తాడుతున్న సమయం
     మీసాలొస్తున్న నిముషాలు
     సోపానాలపై స్వప్నాలు

     నాలుక రాస్తున్న
     పేపర్లు దిద్దలేక
     లివరు అలసిపోతోంది
     అయినా సరే
     ఆశల చివర్లు పట్టుకొనేందుకు
     అప్పుడప్పుడు అలా అలా అని
     సంజాయిషీ ఇచ్చుకొంటూ
     ఉదయపు శిరోభారాన్ని
     మోయడానికి సిదమైన
     సగటు మనిషి
     సంగీత కచేరీ సాగుతోందక్కడ
   

No comments:

Post a Comment