Sunday, 21 April 2013

|రహస్యాల రంగుల చిత్రం ||


 క్రాంతి శ్రీనివాసరావు ||రహస్యాల రంగుల చిత్రం ||


      వాడికి వెన్నెల్లో తడిచి
      ప్రేమ జలుబు చేసింది
      వాడికి ఎండల్లో కాగి
      వేదాంతం అబ్బింది
      వాడికి పొరుగింటి గాలులు తోలి
      వింత పైత్యం చేసింది
      వాడికి పాత నీతి సుత్రాలు తిని
      బుర్ర కలుషితమై పోయింది
      వాడికి ఉన్నానని చెప్పుకొనేందుకు
      వెర్రి శబ్ధాలు చెయ్యడం అలవాటయుపోయింది నాలాగా

      నేనింకా ఆపనేలేదు
      అబ్బో
      వాడి కప్పుడే కోపమొచ్చింది
      గాంధీని బుద్దుడుని గుర్తు చేస్తున్నాడు
      మహాత్ముల నందరినీ
      అద్దాల బీరువాల్నిండా పెట్టి
      ఆదర్శం అదని ఉట్టిలో దాచిపెట్టా్డుగా మరి

      పాపం వాడు మాత్రం ఏం చేస్తాడులే
      వాడూ సగటు తనం లోనే కదా
      ఈదులాడుతున్నది

      వాడే
      వెనక్కి చూడకుండా
      అంతరిక్షాన్ని చీల్చుకొంటూ వెళ్ళిపోతున్నాడు
      అణువు అంతర్ల్లోకాల్లోకి దూసుకెళుతున్నాడు
      రహస్యాల రంగుల చిత్రం గీస్తున్నాడు
      వాడే
      తెలివి సంద్రంలో
      తెప్పలపై తీరం దొరకక తిప్పలు పడుతున్నాడు

      మళ్ళీ వాడే
      బొబ్బిలి వీణలు పిల్లనగ్రోవులు
      కీ బోర్డులో పలికించినా
      నాదాలు అవే అయ్యు నిందచెంది
      జ్నానం రెప్పలపై నిలబడి
      అప్పుడప్పుడూ
      నిద్దురపోతున్నాడు

     

No comments:

Post a Comment