క్రాంతి శ్రీనివాసరావు ||చదువుకొన్న నిరక్షరాస్యుడు ||
నేను నిజంగానే నిరక్షర కుక్షిని
తెరిచిపెట్టిన జీవిత పుస్తకాలు
చుట్టూతూ ఉన్నా
ఒక్క అక్షరమూ చదవలేని
అచ్చమయిన నిరక్షరాస్యుడను
కళ్ళనిండా చీకటి పోసుకొని
ఎక్కడెక్కడో వెతికే వాణ్ణి
మహాను భావత్వం
మరుగున పడిందని
నేను నిజంగానే నిరక్షర కుక్షిని
అరుగు ఆసరా లేకుండా
సైకిల్ ఎక్కలేని
ఎక్కాక దిగలేని
మొగలా సాయిబును చూసి
ముసి ముసిగా నవ్వుకొనే వాణ్ణి
బతుకు బైస్కిల్ ను
బ్రహ్మాండంగా తోలుతున్నాడని
తెలియదప్పుడు
నేను నిజంగానే నిరక్షర కుక్షిని
శాంత మూర్తి తాతయ్యకు
పౌరుషమే లేదనుకొన్నా
తను వద్దన్నా
జింకను చంపేసారని
వందేళ్ళు బతికినా
ఎన్నడూ మాంసం ముట్టని
అపర భీస్ముడాయన
నేను నిజంగానే నిరక్షర కుక్షిని
ఏకాకి అనుకొన్న
నాగళ్ళోరి నానమ్మ
ఎకరం పొలం తోనే
వెలితి లేకుండా బతికి
వయసయ్యాక ఎవ్వరికీ
చెప్పకుండా ఎటో వెళ్ళిపోయు
ఆత్మాభిమానానికి అద్దం పట్టిందామె
నేను నిజంగానే నిరక్షర కుక్షిని
పాలేరు తాత వీరెంకయ్య
రూపం లో వస్త్ర ధారణలో
గాంధీ తాతలా వున్నాడని
ఎగతాళి చేసాం కానీ
తొబ్బయ్యో ఏటకూడా
తన కస్టం తోనే బతికిన
మహానుభావుడని
అనుకోలేదప్పుడు
నేను నిజంగానే నిరక్షర కుక్షిని
సుళ్ళు చూసి
గొడ్లను కొనిపెట్టే అప్పయ్యతాత
విధి వక్రీక రిస్తే
చెళ్ళెళ్ళకు కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేసి
అలసినా ఇప్పుడు
మనవరాళ్ళను సాకాల్సి వచ్చినా
సుడిపడని సుగుణాత్ముడతడు
తెలుసుకోలేకపోయానప్పుడు
నేను నిజంగానే నిరక్షర కుక్షిని
కెసినో రౌలెట్ ఆటలో
బాలాగిన సంఖ్య
బహుమతు లందుకొన్నట్లు
వేలాది మంది మనుషుల్లో
ఎవడో ఒక్కడు వెలుగులోకొచ్చి
వెలకట్టబడతాడు
వాని జీవితాన్నే
ఫ్రేములు కట్టి పూజిస్తుంటాం
మనుషులంతా మాయమయ్యారని
గుండెలు బాదుకొని పాటలు పాడుకొంటాం
నిజంగానే నిజంగా నిజంగానే
మనం నిరక్షర కుక్షులం
బతుకు పుస్తకాలు చదివించే బళ్ళో
బలపం పట్టుకోవాలిప్పుడు
అక్షరాలు మళ్ళీ దిద్దుకోవాలిప్పుడు
ఈంత బాగుందో! అభినందనలు క్రాంతి శ్రీనివాసరావుగారూ!
ReplyDelete