Wednesday, 27 March 2013

|దారి కోసం |


  క్రాంతి శ్రీనివాసరావు ||దారి కోసం ||


    చదువుకు సంస్కారానికి
    చదువుకు స్వావలంబనకూ
    విడాకులు మంజూరయ్యాయు
    సంస్కృతి మారుమనువాడింది

    రూపాయి గుండెకు చిల్లులు పడ్డాయి
    అభివృద్దికి వైధవ్య భయం పట్టుకొంది

    బిందువులన్నీ
    గుండ్రం గానే వున్నట్లు
    బంధాలన్నీ
    ఆర్ధిక సంబంధాలేనని
    అర్ధం కాని
    మనిషితనాన్ని
    ఆర్ధిక వంచన కొంచెం కొంచెంగా
    కొరుక్కు తినేసింది

    కళ్ళ ముందు  కాళ్ళ ముందు
    కలల్లోనూ మనసు అలల్లోను
    శూన్యం సూర్యునిలా
    వెలిగిపోతుంటే

    కన్నీళ్ళూ
    కస్టాల దాహం తీర్చనని
    మొరాయిస్తే
    భయంలో ఊహలు
    ఉడికి ఉడిగి పోతున్నప్పుడు

    వేస్తున్న ప్రతి అడుగూ జారిపోతుంటే
    లోపల నిర్మాణాలన్నీ కూలిపోతుంటే

    జాతక చక్రాలు దొర్లించుకొంటూ
    జ్యొతిశ్యుని కోసం వెదుక్కుంటారు
 
    వాడు
    వానితోనే గతం గాలిపటాలను
    ఎగిరేయించి
    నీడల జాడలు
    నెగడుగ వేసి

    భవిశ్యత్తుకు భరోసాఇస్తూ
    బిజినెస్ డీల్ పూర్తి చేసుకొంటాడు

    తెగిపోతున్న
    మానవ సంబంధాలు పెట్టేవత్తిడికి
    సైంటిస్టులు సైతం
    రహస్యంగా రామ చిలుకలను
    కలుసుకొంటున్నారు

    అరచేతి గీతల్లోను వేలి ముద్రల్లోను
    పుట్టుమచ్చల్లోను
    రేపటిని చదువుకొంటున్నారు

    శాస్త్ర భావనలు ఇంకని మనసులు
    ఇంకా
    శాట్ లైటు కూ
    శని పూజలు చేయుస్తున్నాయి

    ప్రపంచ మంతా ఇప్పుడు
    పొగమంచు దారులు
    పూస్తున్నాయు
    తనని తనే వెతుక్కోడానికీ
    తర్ఫీదులేక జనం
    తలరాతలు చదవబడునన్న
    బోర్డుల ముందు
    బారులు తీరి నిలబడ్డారు
   

No comments:

Post a Comment