క్రాంతి శ్రీనివాసరావు ||అలా వెళ్ళొద్దాం రా ||
సగం కాలిన మనుషులు
కార్బన్ పెనిసిళ్ళలా మారి
కారణాలు రాస్తున్నారు
చదివే మనసుందా
సరస్వతి సిగలోంచి
రాలిపడుతున్న పసిమొగ్గలు
రహస్యమేదో చెబుతున్నాయి
వినగలిగే ఓపికుందా
మగాడి మీసాలకు
ఉరివేయబడుతున్న
గొంతుకలు
గర్జిస్తున్నాయి
గొంతుకలపగలవా
శ్రీరాముని విల్లు కింద
విలవిల్లాడే కప్పలా
ప్రజాసమూహాలను
వృత్తిరాజకీయ నీడలు
కోరలు చాచి కరుస్తుంటే
కలవర పడుతున్నాయి
కాపాడగలవా
కరెన్సీ కంపు
కారు మేఘాల్లా కమ్ముకొంటే
మానవత్వ పరిమళాలు
మంటగలసిపోతున్నాయు
మనిషివై నిలబడతావా
కను సైగలతో నడిచే
కంప్యూటర్ వ్యవస్త నిర్మించుకొన్నా
ప్రేమికుల దారిలో
కులం ముళ్ళింకా పరచుకొనే వున్నాయి
విరిచివేస్తావా
ఏం మాట్లాడవేం
సరేలే
అలావెళ్ళొద్దాం రా
కళ్ళకు కొత్త అద్దాలు
వేయించుకొందువుగాని
No comments:
Post a Comment