Saturday, 16 March 2013

|కాలం గడ్డకట్టే చోటు


 క్రాంతి శ్రీనివాసరావు ||కాలం గడ్డకట్టే చోటు ||


 అమ్మ అరికాలిలో దిగిన
 ముల్లు తీస్తున్నప్పుడల్లా
 పచ్చని చెట్టు చూడమనేది

 గుండెల్లో దిగిన ముళ్ళబాధ
 సహించుకొనేందుకేనేమో
 లేత ఆకుపచ్చ రంగులో
 కనుగుడ్లను ఆకర్షించే
 గుర్రపు నాడా అయస్కాంతాన్ని
 ప్రకృతి మాత ప్రతిష్టించింది

 మంచు దిబ్బలు కరిగి
 నదిగా నాట్య మాడింది
 మల్లెపూల వానయ్యుంది
 పరవశ స్పర్శలొ ముంచింది
 మనసును కడిగే పుస్కరమయింది
 నీళ్ళపై చెక్కిన అద్భుత శిల్పం
 నీటితో వేసిన రంగుల చిత్రం

 నయాగరేగా జాతి జనుల  ఉప్పు
 ఇంకా సెకనుకు టన్ను తింటూనే వుంది
 అందుకేనేమో నయాగరా పేరు ధరించి
 వలసకు అసలును గుర్తు చేస్తూ వుంది

 విశాల కఠధ్వనితో
 మనసు లోతుల్లో
 తుషార సమూహమై
 తడుముతూ
 పసితనపు పరిమళాలు
 నా గాజు గోలీల్లోని పువ్వులు
 గాలిలో తేలి ఆడిస్తూ
 
 బుగ్గలపై నునుసిగ్గుల
 మంచు ముద్దులు
 కురిపిస్తూ
 ఇంద్ర చాపాల మధ్య
 తడిపిస్తూ
 అనుభూతి తప్ప మరేదీ లేని
 ఆలోచనా రహిత
 అద్భుత దైవ క్షణాలను
 తినిపిస్తూ

 ఎందరి కవుల చెవుల్లో
 ఏం చెప్పిందో కానీ
 నయాగరా నన్నుచూసి
 నవ్వుతూ చెప్పింది
 నయగారాలు పోతూ

 జనం కోసం పోరి చూడు
 ఉధ్యమహోరు జోరూ
 తనకంటే ఆనందాన్నిస్తాయన్నది

 జీవితం కోసం
 పరుగెత్తడం ప్రవహించడం కాదు
 విప్లవోద్యమం లోకి దుమికి చూడు
 నాలాగా వీరత్వంతో పైకి లేస్తావన్నది

 ఎంతకాలం
 కాలంతో సహవాసం చేసావన్నది కాదు
 ఎలా మెసిలావన్నదే ముఖ్యం
 నా ప్రయాణం
 ఏరీ నుండి ఒంటారియా దాకే
 ఎందరెందరో నన్ను చూసి మురిసి పోతున్నారన్నది

 దృష్టి కోణాన్ని మార్చి చూడు
 కొత్త దృక్పధాలు మొలుస్తాయన్నది

 బండల గుండెలు కోయడానికి
 బరిసెలూ బల్లాలు అవసరం లేదన్నది
 తననీళ్ళ కాళ్ళు రాళ్ళను కోసినట్లు
 జీవితపు నడక మార్చుకోమన్నది
 నిజాయితీ పాళ్ళు పెంచుకోమన్నది

 ప్రవహించే మది గీత మది
 ప్రసరించే ఇంద్రజాలమది
 అందుకే
 కాలం గడ్డ కట్టే చోటది

No comments:

Post a Comment