క్రాంతి శ్రీనివాసరావు ||పోటెత్తిన జ్నాపకం ||
మైళ్ళ నుండి మైళ్ళదాకా
ఇమెయుళ్ళ ద్వారా సాగి
నిలచిన బతుకు పాట
నిన్నటి తెలుగుపాట పాడుతోంది
అభివృద్ది శిఖరాల మధ్య
ప్రతిధ్వనుల ప్రహేళిక
ప్రళయ ప్రకరణ మవుతోంది
ఎదిగిన బిడ్డ
ఎదరంగులు తెలియక
గింగరాలు తిరుగుతోంది
తాతల ముత్తాతల
మర్యాదల ముసుగులు
మళ్ళీ కప్పుకోవాలనుకొంటోంది
డాలరు నడిపించిన దారుల్లో
దహించబడ్డ సంస్కృతి
దాహంగా వేస్తోంది
ఒంటరి సమూహాల
సమూహం మధ్య
పరమ ఒంటరి దై
బాల్యపు బజార్ల వెంట
జ్నాపకాల్లో నడుస్తోంది
భాషనే కాదు
బాధల్ని భావనల్ని
అనుభూతుల్ని అనుబంధాల్ని
అనువదించుకొంటుది
నీళ్ళతో
గాలిని మూటకడితే బబుల్
పగిలిపోక తప్పదు
జ్నాపకాల నిప్పును
మళ్ళీ కప్పుకొంటే ట్రబుల్
మరచిపోవక తప్పదు
నీకు కావలసిందేదో
నీకే తెలియనప్పుడు
ఓడిన విజేతవవ్వకా తప్పదు
(రోజుకు వందసార్ల్లన్నా ఇండియాకి వెళ్ళొస్తున్నదని తన మనసుపై తనే పిర్యాదు చేసుకొన్న ఓ మిత్రుని గురించి రాసుకొన్న నాలుగు మాటలు )
No comments:
Post a Comment